Thursday, January 27, 2011

ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోండి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే తన ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోవాలని, తాము మాత్రం పదవులకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరారు. తమ రాజీనామా కోరడానికి ముందు ముఖ్యమంత్రితో సహా వైఎస్సార్‌ ఫోటో పెట్టుకుని గెలిచిన ప్రతిఒక్కరూ కూడా రాజీనామా చేసి తిరిగి గెలవాలని అన్నారు. వైఎస్‌ ఫోటో లేకుండా తాము స్వతంత్రంగా, సొంతంగా గెలిచామనే ధైర్యముంటే విశ్వాసాన్ని నిరూపించుకోవాలని చెప్పారు.శాసనసభా మీడియాపాయింట్‌లో బుధవారం సాయంత్రం జగన్‌ మద్దతుదారులు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ విలేఖరులతో మాట్లాడారు. గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత నేత వైఎస్‌, ఆయన కుమారునిపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమతోపాటు లక్షలాది మంది వైఎస్‌ అభిమానులకు బాధ కలిగిస్తుందని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. మాజీ ప్రధాని పివి నర్సింహారావును కలుసుకోవడానికి వైఎస్సార్‌కు తానే అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని, అప్పుడు వైఎస్‌ అనైతిక పని అడిగితే నిరాకరించానని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకసార్లు ప్రజలచేత పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నికైన వైఎస్‌కు అన్ని పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండేవని ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమాలు, అమలుపరిచిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టలేదని, వాటివల్ల దేశవ్యాప్తంగా ఆయన పరపతి పెరిగిందని వారు వివరించారు. తన రాజకీయ జీవితంలో కనీసం మంత్రిగా కాలేని కిరణ్‌కుమార్‌రెడ్డిని చీఫ్‌ విప్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వైఎస్సే నియమించారని, అలాంటి వైఎస్‌ నైతికమైన పని చేయడానికి ఏముంటుందని వారు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని 2004, 2009లో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు వైఎసేనని, ఆయన చేపట్టిన పథకాల వల్లనే రెండవసారి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు గెలిచిన వారందరూ కూడా ఆనాడు ఆయన ఫోటో పెట్టుకుని గెలిచారని ఇప్పటికీ ప్రతి సభలు, సమావేశాలలో వైఎస్సార్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గుర్తుచేశారు. వైఎస్‌ తనయుడు జగన్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేయకముందే తన మంత్రివర్గంలో చేరాలని, ప్రజారాజ్యం పార్టీతో అనైతికంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్‌పై కూడా లేనిపోని మాటలు అంటూ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు.పార్టీ నుంచి బయటకువచ్చి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ చెమటోడ్చి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని 2014లోగా అస్థిరపర్చడం, లేదా పడగొట్టడం జరగదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ అనవసరంగా రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ గుర్తు, వైఎస్సార్‌ కష్టార్జితం వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన వర్గానికి, జగన్‌కు మధ్య సయోధ చర్చలు జరుగుతున్నాయని అనకాపల్లి సబ్బంహరి చెప్పిన మాటలతో తాము ఏకీభవించడం లేదని అన్నారు.


 

Sunday, January 23, 2011

అది రొచ్చుబండ.. బహిష్కరించండి: కేసీఆర్

“తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టిని మరల్చడానికే రచ్చబండ అనే రొచ్చు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిని బహిష్కరించండి. ఈ కార్యక్రమానికి వచ్చే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తరిమికొట్టండి” అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రచ్చబండ కార్యక్రమాన్ని జరగకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెంప చెళ్ళుమనిపించాలని, ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ‘తెలంగాణ వర్తమాన ఉద్యమం-మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ఆయన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పటికే పదేళ్ళు కొట్లాడాం. రాష్ట్ర సాధనకు మరో పదేళ్ళు కొట్లాడతాం” అని ప్రకటించారు. ప్రజలశక్తి ముందు ఏ శక్తీ నిలవదని చెప్పారు. “తెలంగాణపై వలస వాదులు, ఢిల్లీ పెద్దలు కన్‌ఫ్యూజ్.. గోల్‌మాల్ చేస్తరు. కానీ మేం కాము. ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ఉద్యమం ఆగిపోయేది.. ఆరిపోయేది కాదు. ఆగిపోయేదైతే పదేళ్లుగా ఉద్యమం ఉండేది కాదు. ఉద్యమం యాడ చల్లపడ్డది?.. తన్నుకునుడు.. గుద్దుకునుడు.. కాల్చుకొని సచ్చిపోవుడు.. అదే ఉద్యమమా? ఈరోజు 10 వేల గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలు దీక్షలు చేస్తున్నారు. ఎందుకు లొల్లి అని మంచిగ ఉద్యమం చేస్తున్నం. ఈ మతలబు పారలేదంటే కోదండరాం ఒక్కటే పిలుపు ఇస్తడు. అయినా, ఉద్యమం చల్లబడిందని ఉట్టిగనే చెబుత లేరు.. అన్నీ తెలిసే అట్లంటాన్రు. హింస లేకుండా ఉద్యమిస్తుంటే చల్లబడిందనడం కూడా కుట్రే. అదే హింస జరిగితే.. విద్యార్థులు అలజడి సృష్టిస్తే.. కోదండరాం తాలిబన్లను తయారు చేసిండని అంటరు. శాంతంగా ఉద్యమం చేస్తే ఏమీ లేదంటారు” అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం క్యారెక్టర్ మార్చుకొని.. వ్యూహాత్మక పంథాలో ముందుకు వెళుతోందని కేసీఆర్ చెప్పారు.

ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉధృతం చేస్తాం : ప్రొఫెసర్‌ కోదండరాం


కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. కోదండరామ్‌ కూకట్‌పల్లిలో దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ అన్ని ప్రాంతాల్లో జెఎసి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని, దీని కోసం అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం అహింసాయుత పోరాటాల ద్వారానే సిద్ధించిందనీ, అదే పద్దతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని కోదండరాం అన్నారు. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ వచ్చే వరకూ ఈ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉందనీ, ఇందుకోసం ఆ పార్టీపై తమ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమంలో తమతో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలనీ, నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన ఆకాంక్షించారు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాప్రతినిధులు, పాలకులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం నగరంలోని బోడుప్పల్‌, సికింద్రాబాద్‌, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షా శిబిరాలలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు సంఘీభావం ప్రకటించారు.

Saturday, January 22, 2011

సూరితో బంధుత్వం మాత్రమే: శ్వేతారెడ్డి

హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరితో గల సంబంధాలపై తనపై వచ్చిన వార్తలను టీవీ చానెల్ యాంకర్ శ్వేతా రెడ్డి ఖండించారు. తాను సూరికి గానీ భాను కిరణ్‌కు గానీ బినామీగా వ్యవహరించలేదని, తన పేరు మీద విధమైన ఆస్తులు కూడా లేవని ఆమె స్పష్టం చేశారు. తన పేరు మీద వివిధ సంస్థల్లో సూరి, భాను కిరణ్ పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. తాను తనకు వచ్చే జీతంపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనను పోలీసులు విచారించిన మాట వాస్తవమేనని, భాను కిరణ్‌తో తనకు ప్రాణహాని ఉందని సూరి మీతో చెప్పాడా అనేదే పోలీసులు ప్రధానంగా అడిగిన ప్రశ్న అని ఆమె చెప్పారు. ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. సూరి తమ ఇంటికి వచ్చేవారని, తమకు బంధుత్వం ఉందని, బంధుత్వం ఉండడమే తన కర్మ అని ఆమె అన్నారు. భాను కిరణ్ తనకు తెలియదని, సూరితో వాసుదేవ రెడ్డి తమ ఇంటికి వచ్చేవాడని ఆమె చెప్పారు. సూరి తరుచుగా తనతో మాట్లాడేవాడని, వార్తలు ఏమున్నాయని అప్పుడప్పుడు ఫోనులో అడిగేవాడని ఆమె చెప్పారు.తన వ్యవహారాల గురించి సూరి తనతో మాట్లాడేవాడు కాదని, తాను కూడా అడిగేదాన్నికానని ఆమె అన్నారు. భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే సూరిని మానవీయ కోణంలో తాను ఇంటర్వ్యూ చేసి ప్రెజెంట్ చేశానని, తమ ఎన్టీవి యాజమాన్యం అంగీకరించకపోతే తాను ఇంటర్వ్యూ చేసి ఉండేదాన్ని కాదని, అందులో సూరికి ఫేవర్ చేసే విషయమేదీ లేదని ఆమె అన్నారు. తన సోదరుడి మరణం గురించి సూరికి తెలుసునని, అయితే అవన్నీ మరిచిపోయి ప్రశాంతంగా జీవించాలని చెప్తుండేవాడని ఆమె అన్నారు. తానో హీరోను ప్రేమించినట్లు, అతన్ని సూరి ముఠాతో కొట్టించినట్లు వచ్చిన వార్తలను కూడా ఆమె ఖండించారు. మీడియా తనపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయని, అలా వార్తలు ఇచ్చిన మీడియాపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు.తనకు ఆత్మస్థయిర్యం ఉందని, పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. భాను కిరణ్ గురించి సూరి తనతో ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు.

నివేదికపై మొదటిసారి నోరు విప్పిన సీఎం

న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మొదటిసారి మాట్లాడారు. అంశాన్ని ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు. పార్టీ విధానంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న వెంటనే వెల్లడిస్తామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్‌ నిర్ణయం కేంద్రం నిర్ణయానికి భిన్నంగా ఉన్నా, వీలైనంత త్వరగా బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కిరణ్‌ కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత ప్రధాని మన్మోహన్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ తోనూ సమావేశమయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ ముఖ్యనేత ప్రణబ్‌ ముఖర్జీతో, మరో సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. సీఎం శనివారం సోనియాతో సమావేశమయ్యే అవకాశముంది. సమావేశాల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక చుట్టూనే చర్చ సాగింది. నివేదిక బహిర్గతమైన నాటినుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పార్టీల స్పందనలపై తమ పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి నివేదించినట్లు తెలిసింది.

ధరలను నియంత్రించే వరకూ పోరాటం ఆగదు

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రబాబు సికింద్రాబాద్ మోండా మార్కెట్ చంద్రబాబు నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. అనంతరం ఆయన ఆర్‌పీ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మార్కెట్ లోని వ్యాపారులు, వినియోగదారులతో మాట్లాడుతూ పెరిగిన ధరలతో పేదలు నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలీగా వెళ్లి ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేవరకూ పోరాడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ధరలు పెరుగుతున్నాయని అన్నారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టీడీపీ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

Sunday, January 16, 2011

ఇప్పుడు అవిశ్వాసం అంటే చాలు.. కిరణ్ సర్కార్ మటాష్..!!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన 24 గంటల జలదీక్ష కాంగ్రెస్ హైకమాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఎందుకంటే... ఆయన చేపట్టిన 24 గంటల జలదీక్ష "సాక్షి"గా అధికార పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట కూచున్నారు. ఈ పరిణామంతో కిరణ్ సర్కార్ పతనం అంచుకెళ్లిపోయిందన్న వాదనలు ఊపందుకున్నాయి. జగన్ వెంట ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లకుండా చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ డీఎస్ రంగంలోకి దిగి బుజ్జగింపులు, భయపెట్టడాలు చేసినా వారు ఖాతరు చేయలేదు. పైపెచ్చు దీక్షా వేదికపై నుంచి దమ్ముంటే తమపై చర్య తీసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిపై అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ హుటాహుటిన హైదరాబాదుకు చేరుకుని సీఎం, పీసీసీ చీఫ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన  మాట్లాడుతూ... 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులను ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే జగన్ వెంట 24 మంది ఎమ్మెల్యేలు బాహాటంగా నడుస్తుండటంతో కిరణ్ సర్కార్ మైనార్టీలో పడిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా తనతో ఉన్న ఎమ్మెల్యేలంతా 2014లో జరుగబోయే ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీ చేస్తారని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించడంతో ఇక కిరణ్ సర్కార్ పని అయిపోనట్లేనని వారు వాదిస్తున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం తన బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌కు ఏ చిన్న పార్టీ లేఖ రాసినా కిరణ్ సర్కార్ కష్టాలు తప్పవు. అయినా ప్రభుత్వాన్ని నడిపేందుకు సహకరించే సభ్యులే తిరిగి సొంత పార్టీని తూర్పారబట్టడం చిత్రమే. ఇలా తూర్పారబడుతున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం మరీ మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం జగన్ దయతో ప్రభుత్వం నడవడం లేదనీ, ఒకవేళ తనకు అంత బలం ఉంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా సాధనకోసం తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. వారు కనుక ఆ పని చేస్తే కేంద్రంలో యూపీఎ సర్కార్‌కు కష్టాలు తప్పవు. మొత్తమ్మీద అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతోనే ఆయువు తీరే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తుందో చూడాలి.