Saturday, January 22, 2011

నివేదికపై మొదటిసారి నోరు విప్పిన సీఎం

న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మొదటిసారి మాట్లాడారు. అంశాన్ని ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తోందని తెలిపారు. పార్టీ విధానంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న వెంటనే వెల్లడిస్తామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెస్‌ నిర్ణయం కేంద్రం నిర్ణయానికి భిన్నంగా ఉన్నా, వీలైనంత త్వరగా బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. కిరణ్‌ కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత ప్రధాని మన్మోహన్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ తోనూ సమావేశమయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ ముఖ్యనేత ప్రణబ్‌ ముఖర్జీతో, మరో సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. సీఎం శనివారం సోనియాతో సమావేశమయ్యే అవకాశముంది. సమావేశాల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక చుట్టూనే చర్చ సాగింది. నివేదిక బహిర్గతమైన నాటినుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పార్టీల స్పందనలపై తమ పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి నివేదించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment