Monday, January 10, 2011

తెలంగాణపై కేసీఆర్‌వి కల్లిబొల్లి కారుకూతలేనా?!!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధిలేదా.? రాష్ట్ర ఏర్పాటుపై గత యేడాది కాలంగా చేసిన వ్యాఖ్యలన్నీ కల్లిబొల్లి కారుకూతలేనా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుతం పది నెలల పాటు రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమైక్యానికే తొలి ఓటు అంటూ వెల్లడించింది. ఈ నివేదిక అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ నిన్నమొన్నటి వరకు చెప్పిన.. చేసిన మాటలు, ప్రగల్భాలు ఏమయ్యాయనే ధర్మసందేహం ఇపుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారని, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే దానికి అడ్డుపడ్డారంటూ డిసెంబరు 31వ తేదీ ముందు వరకూ బాబుపై కేసీఆర్ నిప్పులు కురిపించారు. ఇపుడు సడన్‌గా  తన బాణీని మార్చుకున్నారు. కాంగ్రెస్‌పై కత్తులు కారాలు నూరడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో అసలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారా? లేదా?. 2009 డిసెంబరు 9వ తేదీన కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన తాను చెప్పినట్లుగానే వచ్చిందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాటలను ఎందుకు ప్రస్తావించడం లేదు. అంతేకాకుండా, వచ్చే యేడాది దసరా ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని కేసీఆర్‌ ప్రజల్లో ఆశలురేకెత్తించారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా తన భుజస్కంధాలపై ఉందంటూ ఢిల్లీలో సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆ రకంగా తెలంగాణకు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అడ్డంకి తప్ప, సోనియా గాంధీ సుముఖంగానే ఉన్నారన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ కోర్టు బోనులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలు, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదికతో తనను తాను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ను దుయ్యబట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది అటు కేసీఆర్‌తో పాటు.. తెరాసకు రాజకీయంగా, ఎత్తుగడపరంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుకు విఘాతం కలిగించేదేనన్నారు. ప్రధానంగా నిమ్స్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంగా గత డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన వెనుక తానే ఉన్నానని, తాను చెప్పినట్లుగానే చిదంబరం ప్రకటన చేశారని చాలా నెలల తర్వాత గొప్పగా కేసీఆర్‌ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌, హోంమంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. వాటి వివరాలు నేటికీ "చిదంబర రహస్యం"గానే ఉండిపోయాయి. ఆ తర్వాత కూడా సోనియా తెలంగాణ ఎప్పుడో ఇచ్చేసిందని, చంద్రబాబునాయుడే దానికి అడ్డుపడి, సీమాంధ్రలో అన్ని పార్టీలను ప్రోత్సహించి ఉద్యమానికి ఊపిరి పోశారంటూ కేసీఆర్‌ నిన్న మొన్నటి వరకూ ధ్వజమెత్తారు. ఇపుడు జస్టీస్ శ్రీకృష్ణ నివేదిక సమైక్యవాదానికే మొగ్గు చూపడంతో కేసీఆర్‌ ఇప్పటివరకూ చెప్పినవి, చేసిన ప్రకటనలలో అణు మాత్రం విశ్వసనీయత లేదన్న విషయం తేటతెల్లమైంది. కేవలం చంద్రబాబు నాయుడును తెలంగాణలో భ్రష్టుపట్టించేందుకే కేసీఆర్ ఒక పథకం ప్రకారం "బాబు ఒక్కడే తెలంగాణకు అడ్డంకి" అన్న ప్రచారానికి తెరలేపారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైపెచ్చు.. తాజా పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన కేసీఆర్‌ హఠాత్తుగా గళం మార్చి మళ్లీ కాంగ్రెస్‌ను తూర్పారపట్టడం సొంత పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకే పోతున్నారు. నాడు సోనియా తెలంగాణను ఎప్పుడో ఇచ్చిందన్న ఆయనే, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను తిట్టిపోయడంతో తమ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని తెరాస శ్రేణులు అభిప్రాయపడటమే కాకుండా, కేసీఆర్‌వి కల్లిబొల్లి గాలి కబుర్లుగా మారాయని తెదేపా నేతలు దుయ్యబడుతున్నారు.

1 comment:

  1. శ్రీకృష్ణ కమిటీ ఏమి చెప్పదలచుకుందో అర్థం కాదు. ఒకవైపు యథా స్థితి ఉండకూడదు అంటారు. ఇంకో వైపు సమైక్య రాష్ట్రం ఉండాలంటారు. యథా స్థితి అంటే సమైక్య రాష్ట్రమే కదా. ఈ నివేదికని అర్థం చేసుకోవడం కెసిఆర్‌కే కాదు, ఎవరికీ సాధ్యం కాదు. శ్రీకృష్ణ కమిటీని కాకుండా కెసిఆర్‌ని దుయ్యబడితే ఏ ప్రయోజనం ఉండదు.

    ReplyDelete