జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతమైన వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ముఖాల్లో నెత్తుటిచుక్క లేకుండా పోయింది. పూర్తిగా నిర్వేదం నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యాంధ్రగా కొనసాగింపే ఉత్తమ పరిష్కారమని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది. ఇది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అదేసమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించే దమ్మూధైర్యం ఏ ఒక్కరికీ లేదు. కమిటీ సూచించిన విధంగా తెలంగాణకు రాజ్యంగ, చట్టబద్ధమైన హక్కులు కల్పించడం అసాధ్యమని వారు వ్యాఖ్యానించారు. నివేదిక బహిర్గతమైన అనంతరం ఎంపీలందరూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. డిసెంబర్ 9 న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండేలా కేంద్రం, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని జైపాల్‌ను కోరారు. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సారధ్య బాధ్యతలను సీనియర్ నేత జైపాల్ రెడ్డే స్వీకరించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఈప్రాంతవారికి సంతృప్తినివ్వలేదని తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న ఈ నివేదికను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఎంపీలందరూ స్పష్టం చేశారు. యథాతథ స్థితిని కొనసాగించడం అసంభవమన్నారు. రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులతో సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం అమలు పూర్తిగా విఫలమయ్యాయని వారు గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శాశ్వత పరిష్కారమని వారు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment