వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన 24 గంటల జలదీక్ష కాంగ్రెస్ హైకమాండ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఎందుకంటే... ఆయన చేపట్టిన 24 గంటల జలదీక్ష "సాక్షి"గా అధికార పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు జగన్ వెంట కూచున్నారు. ఈ పరిణామంతో కిరణ్ సర్కార్ పతనం అంచుకెళ్లిపోయిందన్న వాదనలు ఊపందుకున్నాయి. జగన్ వెంట ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లకుండా చేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ డీఎస్ రంగంలోకి దిగి బుజ్జగింపులు, భయపెట్టడాలు చేసినా వారు ఖాతరు చేయలేదు. పైపెచ్చు దీక్షా వేదికపై నుంచి దమ్ముంటే తమపై చర్య తీసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరిపై అధిష్టానం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ హుటాహుటిన హైదరాబాదుకు చేరుకుని సీఎం, పీసీసీ చీఫ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులను ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే జగన్ వెంట 24 మంది ఎమ్మెల్యేలు బాహాటంగా నడుస్తుండటంతో కిరణ్ సర్కార్ మైనార్టీలో పడిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా తనతో ఉన్న ఎమ్మెల్యేలంతా 2014లో జరుగబోయే ఎన్నికల్లో తన పార్టీ తరపున పోటీ చేస్తారని వైఎస్ జగన్ స్వయంగా ప్రకటించడంతో ఇక కిరణ్ సర్కార్ పని అయిపోనట్లేనని వారు వాదిస్తున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం తన బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌కు ఏ చిన్న పార్టీ లేఖ రాసినా కిరణ్ సర్కార్ కష్టాలు తప్పవు. అయినా ప్రభుత్వాన్ని నడిపేందుకు సహకరించే సభ్యులే తిరిగి సొంత పార్టీని తూర్పారబట్టడం చిత్రమే. ఇలా తూర్పారబడుతున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ గుడ్లప్పగించి చూస్తూ ఉండటం మరీ మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం జగన్ దయతో ప్రభుత్వం నడవడం లేదనీ, ఒకవేళ తనకు అంత బలం ఉంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈ విషయం ఇలా ఉంటే తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా సాధనకోసం తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణా కాంగ్రెస్ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. వారు కనుక ఆ పని చేస్తే కేంద్రంలో యూపీఎ సర్కార్‌కు కష్టాలు తప్పవు. మొత్తమ్మీద అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతోనే ఆయువు తీరే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment