Thursday, January 27, 2011

ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోండి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే తన ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోవాలని, తాము మాత్రం పదవులకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరారు. తమ రాజీనామా కోరడానికి ముందు ముఖ్యమంత్రితో సహా వైఎస్సార్‌ ఫోటో పెట్టుకుని గెలిచిన ప్రతిఒక్కరూ కూడా రాజీనామా చేసి తిరిగి గెలవాలని అన్నారు. వైఎస్‌ ఫోటో లేకుండా తాము స్వతంత్రంగా, సొంతంగా గెలిచామనే ధైర్యముంటే విశ్వాసాన్ని నిరూపించుకోవాలని చెప్పారు.శాసనసభా మీడియాపాయింట్‌లో బుధవారం సాయంత్రం జగన్‌ మద్దతుదారులు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ విలేఖరులతో మాట్లాడారు. గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత నేత వైఎస్‌, ఆయన కుమారునిపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమతోపాటు లక్షలాది మంది వైఎస్‌ అభిమానులకు బాధ కలిగిస్తుందని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. మాజీ ప్రధాని పివి నర్సింహారావును కలుసుకోవడానికి వైఎస్సార్‌కు తానే అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని, అప్పుడు వైఎస్‌ అనైతిక పని అడిగితే నిరాకరించానని ముఖ్యమంత్రి చెప్పడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకసార్లు ప్రజలచేత పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నికైన వైఎస్‌కు అన్ని పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండేవని ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన కార్యక్రమాలు, అమలుపరిచిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టలేదని, వాటివల్ల దేశవ్యాప్తంగా ఆయన పరపతి పెరిగిందని వారు వివరించారు. తన రాజకీయ జీవితంలో కనీసం మంత్రిగా కాలేని కిరణ్‌కుమార్‌రెడ్డిని చీఫ్‌ విప్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వైఎస్సే నియమించారని, అలాంటి వైఎస్‌ నైతికమైన పని చేయడానికి ఏముంటుందని వారు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌ పార్టీని 2004, 2009లో అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు వైఎసేనని, ఆయన చేపట్టిన పథకాల వల్లనే రెండవసారి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు గెలిచిన వారందరూ కూడా ఆనాడు ఆయన ఫోటో పెట్టుకుని గెలిచారని ఇప్పటికీ ప్రతి సభలు, సమావేశాలలో వైఎస్సార్‌ ప్రస్తావన లేకుండా మాట్లాడలేకపోతున్నారని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గుర్తుచేశారు. వైఎస్‌ తనయుడు జగన్‌ పార్టీకి, పదవికి రాజీనామా చేయకముందే తన మంత్రివర్గంలో చేరాలని, ప్రజారాజ్యం పార్టీతో అనైతికంగా చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఈ రోజు జగన్‌పై కూడా లేనిపోని మాటలు అంటూ నైతిక విలువల గురించి మాట్లాడుతున్నారని వారు ధ్వజమెత్తారు.పార్టీ నుంచి బయటకువచ్చి ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ చెమటోడ్చి తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని 2014లోగా అస్థిరపర్చడం, లేదా పడగొట్టడం జరగదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ అనవసరంగా రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ గుర్తు, వైఎస్సార్‌ కష్టార్జితం వల్లనే ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన వర్గానికి, జగన్‌కు మధ్య సయోధ చర్చలు జరుగుతున్నాయని అనకాపల్లి సబ్బంహరి చెప్పిన మాటలతో తాము ఏకీభవించడం లేదని అన్నారు.


 

No comments:

Post a Comment