Sunday, January 23, 2011

అది రొచ్చుబండ.. బహిష్కరించండి: కేసీఆర్

“తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టిని మరల్చడానికే రచ్చబండ అనే రొచ్చు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దానిని బహిష్కరించండి. ఈ కార్యక్రమానికి వచ్చే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తరిమికొట్టండి” అని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రచ్చబండ కార్యక్రమాన్ని జరగకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెంప చెళ్ళుమనిపించాలని, ఉద్యమ తీవ్రతను ఢిల్లీకి తెలియజేయాలని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ‘తెలంగాణ వర్తమాన ఉద్యమం-మన కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో ఆయన మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్ల దండకం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమం చల్లబడిందనే ప్రచారాన్ని తోసిపుచ్చారు. “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పటికే పదేళ్ళు కొట్లాడాం. రాష్ట్ర సాధనకు మరో పదేళ్ళు కొట్లాడతాం” అని ప్రకటించారు. ప్రజలశక్తి ముందు ఏ శక్తీ నిలవదని చెప్పారు. “తెలంగాణపై వలస వాదులు, ఢిల్లీ పెద్దలు కన్‌ఫ్యూజ్.. గోల్‌మాల్ చేస్తరు. కానీ మేం కాము. ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ఉద్యమం ఆగిపోయేది.. ఆరిపోయేది కాదు. ఆగిపోయేదైతే పదేళ్లుగా ఉద్యమం ఉండేది కాదు. ఉద్యమం యాడ చల్లపడ్డది?.. తన్నుకునుడు.. గుద్దుకునుడు.. కాల్చుకొని సచ్చిపోవుడు.. అదే ఉద్యమమా? ఈరోజు 10 వేల గ్రామాల్లో లక్షలాదిమంది ప్రజలు దీక్షలు చేస్తున్నారు. ఎందుకు లొల్లి అని మంచిగ ఉద్యమం చేస్తున్నం. ఈ మతలబు పారలేదంటే కోదండరాం ఒక్కటే పిలుపు ఇస్తడు. అయినా, ఉద్యమం చల్లబడిందని ఉట్టిగనే చెబుత లేరు.. అన్నీ తెలిసే అట్లంటాన్రు. హింస లేకుండా ఉద్యమిస్తుంటే చల్లబడిందనడం కూడా కుట్రే. అదే హింస జరిగితే.. విద్యార్థులు అలజడి సృష్టిస్తే.. కోదండరాం తాలిబన్లను తయారు చేసిండని అంటరు. శాంతంగా ఉద్యమం చేస్తే ఏమీ లేదంటారు” అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం క్యారెక్టర్ మార్చుకొని.. వ్యూహాత్మక పంథాలో ముందుకు వెళుతోందని కేసీఆర్ చెప్పారు.

No comments:

Post a Comment