Sunday, January 23, 2011

ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉధృతం చేస్తాం : ప్రొఫెసర్‌ కోదండరాం


కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. కోదండరామ్‌ కూకట్‌పల్లిలో దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ అన్ని ప్రాంతాల్లో జెఎసి నాయకత్వంలో రిలే నిరాహారదీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని, దీని కోసం అంచెలంచెలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కోదండరామ్‌ స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్య్రం అహింసాయుత పోరాటాల ద్వారానే సిద్ధించిందనీ, అదే పద్దతిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని కోదండరాం అన్నారు. ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ వచ్చే వరకూ ఈ రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఉందనీ, ఇందుకోసం ఆ పార్టీపై తమ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమంలో తమతో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రతి పల్లెలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలనీ, నాలుగున్నర కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నందున ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన ఆకాంక్షించారు.
పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాప్రతినిధులు, పాలకులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం నగరంలోని బోడుప్పల్‌, సికింద్రాబాద్‌, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాలను సందర్శించి దీక్షా శిబిరాలలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులకు సంఘీభావం ప్రకటించారు.

No comments:

Post a Comment