పావులు కదుపుతున్న నేతలు
భారతీయ జనతా పార్టీ తన బలం పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకు తెలంగాణా జిల్లాలలో పలు భారీ సదస్సులు నిర్వహిస్తోంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బిజెపి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనే సంకేతాన్నిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఊగిసలాటలో ఉన్న ఈ నేపథ్యంలో ప్రజా బలాన్ని పెంచుకునేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణాలో ప్రస్తుతం రెండు అసెంబ్లీస్థానాలకు బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు డిసెంబర్ 31 కి ముందే భారీ సదస్సులు నిర్వహిస్తోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో మంగళవారం బిజెపి సదస్సును ఏర్పాటు చేసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో తెలంగాణా బిల్లును ప్రవేశపెడితే బిజెపి తన పూర్తి మద్దతును తెలుపుతుందనే సందేశాన్ని ఈ సదస్సుల ద్వారా ప్రజలకు తెలియపరుస్తుంది. గత నిజామాబాదు అర్బన్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిని గెలిపించేందుకు డి ఎస్ ను ఓడించేందుకు టి ఆర్ ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. అయితే ఆ మద్దతును అక్కడికే పరిమితం చేయాలని తెలంగాణా రాష్ట్ర సమితి భావిస్తోంది. బిజెపితో జట్టు కడితే నష్టపోయేది టి ఆర్ ఎస్సే నని గత ఎన్నికల్లో మైనార్టీ వ్యతిరేకత స్పష్టం చేసినట్లు టి ఆర్ ఎస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ తో టి ఆర్ ఎస్ కొంత దగ్గరవడం బిజెపి జీర్ణం చేసుకోలేకపోతోంది.
ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణా అంశాన్ని టి ఆర్ ఎస్, కాంగ్రెస్ ఎం పి లు లేవనెత్తే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కెసిఆర్, విజయశాంతి, కాంగ్రెస్ ఎం పి ల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ లు పార్లమెంట్ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర గళాన్ని విప్పితే బిజెపి జతకూడే అవకాశం ఉంది.
No comments:
Post a Comment