మాజీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి
రెండు రోజులు కూడా గడవక ముందే జగన్ వర్గాన్ని అతలాకుతలం చేస్తున్నారు.
ఇప్పటివరకూ జగన్ అంశంపై కేకేఆర్ నేరుగా స్పందించనేలేదు. కానీ పరోక్షంగా
ఆయన శిబిరం పునాదులను కదిలించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నట్లు
కనబడుతోంది.
నిన్న వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా మంత్రి పదవి కోసం హస్తినకు రావడం
దగ్గర్నుంచి నేడు ఏకంగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జగన్ క్రమశిక్షణ
నియమాలను ఉల్లంఘిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు వరకూ అన్నిటి వెనుకా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం తప్పక ఉండి ఉంటుందన్న
అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక నేరుగా.. అంటే పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టిన దగ్గర్నుంచి
జగన్ వర్గాన్ని దారిలో పెట్టేందుకు కేకేఆర్ ఎటువంటి వ్యూహరచన చేస్తారన్న
చర్చ సాగుతోంది. రాష్ట్రానికి సారథ్యం వహించే ముఖ్యమంత్రికి పెద్ద
తలనొప్పులు రెండే అని అందరూ చెపుతున్నప్పటికీ, ఆ రెండింటిలో ఒకటి (జగన్
సమస్య) పార్టీ చూసుకుంటుందనీ, మరో సమస్య (తెలంగాణా సమస్య)ను కేంద్ర
ప్రభుత్వం చూసుకుంటుందని తనపై ప్రత్యక్ష ఆరోపణలు చేసేవారి నోళ్లు
ముందుగానే మూయించేశారు సీఎం కిరణ్.
ఇక తన ముందు రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర కాంగ్రెస్ బలోపేతం అనే రెండు
అంశాలేనన్న సంకేతాలను ఆయన పంపిస్తున్నారు. అయితే అధిష్టానాన్ని,
ముఖ్యమంత్రిని విమర్శించేవారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్న
హెచ్చరికలు సైతం ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించిన రెండు మూడు రోజులకే రావడం
కాకతాళీయం కాబోవు.
మొత్తానికి కొత్త సీఎం కిరణ్ అన్ని సమస్యల పీచమణిచే గట్టి సీఎం అని
తేటతెల్లమవుతోంది. సీఎం ఇస్తున్న పరోక్ష షాక్‌లకు జగన్ వర్గం ఆత్మరక్షణలో
పడిపోతున్నట్లు కనబడుతోంది. గతంలో రోశయ్యను అల్లాడించిన జగన్ కొత్త సీఎం
కిరణ్ పట్ల ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తారో చూడాలి.
No comments:
Post a Comment