Monday, January 10, 2011

లాగులు ఊడగొట్టి పంపించే రోజు దగ్గర్లోనే ఉంది: తెరాస

తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి తరిమే సమయం అతి దగ్గర్లోనే ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మరుక్షణం ఇది జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు నాయిని నర్శింహా రెడ్డి, చంద్రశేఖర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వారు ఆరోపించారు.

తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత నాయిని నర్సింసింహా రెడ్డి, చంద్రశేఖర్‌లు ప్రసంగిస్తూ తెలంగాణలోని పోలీసు బలగాలను చూస్తుంటే రాష్ట్రపతి పాలనను తలపిస్తోందన్నారు. అందువల్ల కొత్తగా రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారని గుర్తు చేశారు.

రాష్ట్ర పాలనా పగ్గాలు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చేతిలో లేవని గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు తెలంగాణకు అవమానంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఇప్పటికైనా వారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలన్నారు. కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి మెత్తబడిందన్న వార్తలను మాజీ మంత్రి, తెరాస సీనియర్ నేత సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ తోసిపుచ్చారు. సమైక్యవాదుల లాగులు ఊడగొట్టి వారిని పంపించే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలుకు సిగ్గు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమించాలన్నారు. 

తెలంగాణపై కేసీఆర్‌వి కల్లిబొల్లి కారుకూతలేనా?!!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధిలేదా.? రాష్ట్ర ఏర్పాటుపై గత యేడాది కాలంగా చేసిన వ్యాఖ్యలన్నీ కల్లిబొల్లి కారుకూతలేనా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుతం పది నెలల పాటు రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమైక్యానికే తొలి ఓటు అంటూ వెల్లడించింది. ఈ నివేదిక అంశాన్ని పక్కన పెడితే కేసీఆర్ నిన్నమొన్నటి వరకు చెప్పిన.. చేసిన మాటలు, ప్రగల్భాలు ఏమయ్యాయనే ధర్మసందేహం ఇపుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారని, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే దానికి అడ్డుపడ్డారంటూ డిసెంబరు 31వ తేదీ ముందు వరకూ బాబుపై కేసీఆర్ నిప్పులు కురిపించారు. ఇపుడు సడన్‌గా  తన బాణీని మార్చుకున్నారు. కాంగ్రెస్‌పై కత్తులు కారాలు నూరడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో అసలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారా? లేదా?. 2009 డిసెంబరు 9వ తేదీన కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన తాను చెప్పినట్లుగానే వచ్చిందని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ మాటలను ఎందుకు ప్రస్తావించడం లేదు. అంతేకాకుండా, వచ్చే యేడాది దసరా ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని కేసీఆర్‌ ప్రజల్లో ఆశలురేకెత్తించారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా తన భుజస్కంధాలపై ఉందంటూ ఢిల్లీలో సంచలనాత్మక ప్రకటన చేశారు. ఆ రకంగా తెలంగాణకు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అడ్డంకి తప్ప, సోనియా గాంధీ సుముఖంగానే ఉన్నారన్న ప్రచారాన్ని తెలంగాణ ప్రజల్లో కల్పించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ కోర్టు బోనులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలు, జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదికతో తనను తాను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ను దుయ్యబట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది అటు కేసీఆర్‌తో పాటు.. తెరాసకు రాజకీయంగా, ఎత్తుగడపరంగా నష్టం కలిగించే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుకు విఘాతం కలిగించేదేనన్నారు. ప్రధానంగా నిమ్స్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంగా గత డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన వెనుక తానే ఉన్నానని, తాను చెప్పినట్లుగానే చిదంబరం ప్రకటన చేశారని చాలా నెలల తర్వాత గొప్పగా కేసీఆర్‌ చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌, హోంమంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. వాటి వివరాలు నేటికీ "చిదంబర రహస్యం"గానే ఉండిపోయాయి. ఆ తర్వాత కూడా సోనియా తెలంగాణ ఎప్పుడో ఇచ్చేసిందని, చంద్రబాబునాయుడే దానికి అడ్డుపడి, సీమాంధ్రలో అన్ని పార్టీలను ప్రోత్సహించి ఉద్యమానికి ఊపిరి పోశారంటూ కేసీఆర్‌ నిన్న మొన్నటి వరకూ ధ్వజమెత్తారు. ఇపుడు జస్టీస్ శ్రీకృష్ణ నివేదిక సమైక్యవాదానికే మొగ్గు చూపడంతో కేసీఆర్‌ ఇప్పటివరకూ చెప్పినవి, చేసిన ప్రకటనలలో అణు మాత్రం విశ్వసనీయత లేదన్న విషయం తేటతెల్లమైంది. కేవలం చంద్రబాబు నాయుడును తెలంగాణలో భ్రష్టుపట్టించేందుకే కేసీఆర్ ఒక పథకం ప్రకారం "బాబు ఒక్కడే తెలంగాణకు అడ్డంకి" అన్న ప్రచారానికి తెరలేపారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైపెచ్చు.. తాజా పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన కేసీఆర్‌ హఠాత్తుగా గళం మార్చి మళ్లీ కాంగ్రెస్‌ను తూర్పారపట్టడం సొంత పార్టీ నేతలు సైతం జీర్ణించుకోలేకే పోతున్నారు. నాడు సోనియా తెలంగాణను ఎప్పుడో ఇచ్చిందన్న ఆయనే, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను తిట్టిపోయడంతో తమ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదని తెరాస శ్రేణులు అభిప్రాయపడటమే కాకుండా, కేసీఆర్‌వి కల్లిబొల్లి గాలి కబుర్లుగా మారాయని తెదేపా నేతలు దుయ్యబడుతున్నారు.

Friday, January 7, 2011

ఉపాధి కోల్పోయిన డీలర్లు

తమను పక్కకు పెట్టాలని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని చౌకధరల డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు తాము దీనితోనే ఉపాధి పొందుతున్నామని, ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ  అవకాశాన్ని కల్పించలేకపోవడం తమకెంతో నష్టాన్ని కల్గిస్తుందని ఈ జిల్లాలో పనిచేస్తున్న చౌకధరల డీలర్లు కలవరపడుతున్నారు. అయితే ఈ దుకాణాల బాధ్యతలను ఐ కే పి మహిళలకు ఇవ్వనున్నామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏకపక్ష నిర్ణయంగా కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐకేపి మహిళలు మాత్రమే విధులు సరిగా నిర్వహిస్తున్నట్లు ఈ సర్కార్ భావించింది అనే అభిప్రాయాన్ని కొందరు వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే గతాన్ని ఒకసారి పరిశీలిస్తే ఉపాధి హామీ పనుల్లో పెద్దమొత్తంలో చేసిన అవినీతి ఊసే ఎత్తకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపిస్తోంది. అయితే తమను పక్కనబెట్టి మాకు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపించకపోవడం
ఏం న్యాయమని డీలర్లు ప్రభుత్వాదికారుల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మరి ఇప్పుడైనా వారు సరిగా బాధ్యతలు నిర్వర్తిస్తారా అంటే నమ్మకం లేదంటున్నారు ప్రజలు. అవినీతి రుచిమరిగిన వీరు ఇక ఎలా పనులు చేస్తారో ప్రజల మెప్పు ఎలా పొందుతారో చూడాల్సిందే!

Thursday, January 6, 2011

సంతృప్తి పరచని శ్రీకృష్ణ నివేదిక

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు బహిర్గతమైన వెంటనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీల ముఖాల్లో నెత్తుటిచుక్క లేకుండా పోయింది. పూర్తిగా నిర్వేదం నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్యాంధ్రగా కొనసాగింపే ఉత్తమ పరిష్కారమని జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నిర్ధారించింది. ఇది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. అదేసమయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించే దమ్మూధైర్యం ఏ ఒక్కరికీ లేదు. కమిటీ సూచించిన విధంగా తెలంగాణకు రాజ్యంగ, చట్టబద్ధమైన హక్కులు కల్పించడం అసాధ్యమని వారు వ్యాఖ్యానించారు. నివేదిక బహిర్గతమైన అనంతరం ఎంపీలందరూ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. డిసెంబర్‌ 9 న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండేలా కేంద్రం, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని జైపాల్‌ను కోరారు. అంతేకాకుండా ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సారధ్య బాధ్యతలను సీనియర్ నేత జైపాల్ రెడ్డే స్వీకరించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఈప్రాంతవారికి సంతృప్తినివ్వలేదని తమ మనోభావాలను కించపరిచేలా ఉన్న ఈ నివేదికను తాము తిరస్కరిస్తున్నామని తెలంగాణ ఎంపీలందరూ స్పష్టం చేశారు. యథాతథ స్థితిని కొనసాగించడం అసంభవమన్నారు. రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులతో సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఇప్పటికే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం అమలు పూర్తిగా విఫలమయ్యాయని వారు గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే శాశ్వత పరిష్కారమని వారు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు.

Tuesday, December 28, 2010

ఎట్టకేలకు దీక్ష విరమించిన ఎంపిలు

తెలంగాణా విద్యార్థులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు దీక్ష చేపట్టిన విషయం విదితమే! రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలో కొన్ని కేసులే ఎత్తేస్తాం అన్నీ అంటే కష్టమని చెబుతూ వచ్చారు. కానీ వారి దీక్ష ఇంకా ఉద్రుతమైతే చాలా ఇబ్బందులు ఎదురుతాయని భావించిన సర్కార్ దిగి వచ్చింది. ఎట్టకేలకు కాంగీ ఎంపిలు దీక్ష విరమించారు. అయితే విద్యార్థులపై కేసులన్నీ పూర్తిగా ఎత్తేసినందుకు ముఖ్యమంత్రిని కలిసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. 

Sunday, December 26, 2010

తెలంగాణా ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం

కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సైతం వెనుకాడబోమని వారు హెచ్చరించారు. ఇదే అంశంపై సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నట్టు ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆదివారం భేటీ అయ్యారు. ఇందులో పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే ప్రతిపాదన పెట్టగా, దీనికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఫలితంగా డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, విద్యార్థులు, ఉద్యమకారుల పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేసే వరకు రేపటి నుంచి గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఎంపీలంతా నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 11 గంటలకు సమావేశమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలు తెలంగాణ అంశంపై మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించారు. 

Wednesday, December 22, 2010

ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది

రైతన్న కంట తడిబెట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ అన్నారు. రైతులు కన్నీరు పెట్టుకుంటే రాష్ట్రానికి అరిష్టమని రాజన్న చెప్పేవారని, అలాంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు.

రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని జగన్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని కృష్ణాతీరంలోని వైఎస్సార్ ప్రాంగణం వేదిక నుంచి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించడానికి ఇంకా ఎంత మంది రైతులు మరణించాలని జగన్ ప్రశ్నించారు. రైతును ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటారని జగన్ అడిగారు. ఇంకా మూడేళ్ల సమయం ఉందనే అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు దక్కవని జగన్ జోస్యం చెప్పారు.