Tuesday, December 14, 2010

ఆంధ్రా పాలనలో తెలంగాణకు న్యాయం జరగదు: ఈటెల

ఈ ఆంధ్రా ప్రాంతానికి చెందిన పాలకుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతానికి గానీ ఈ ప్రాంత విద్యార్థులకు గానీ ఎలాంటి న్యాయం జరగదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. తెరాస సభ్యులు మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత గన్‌పార్కుకు ర్యాలీగా వెళ్లారు.
అనంతరం గన్ పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని ముక్తకంఠంతో కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల గొంతు నొక్కే కుట్ర పన్నిందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
గతంలో ఐపీఎస్ అధికారులపై అనేక దాడులకు పాల్పడ్డవారిపై కేసులు ఎత్తివేసిన ప్రభుత్వం విద్యార్థులపై మాత్రం కేసులు ఎత్తివేయడానికి మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. 400 మంది విద్యార్థులను కోల్పోయి న్యాయం కోసం ఉద్యమించిన విద్యార్థులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రంగా హత్య తర్వాత జరిగిన దమనకాండ నేరస్తులను ప్రభుత్వం వదిలి పెట్టిందని ఈటెల్ గుర్తు చేశారు.
అనంతరం తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా తమను శాసనసభ నుంచి బయటకు గెంటేశారన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బయటకు వెళ్లి రఘువీరారెడ్డితో సస్పెన్షన్ ప్రకటన చేయించారని ఆయన మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో తిరుగుతారని ఆయన ప్రశ్నించారు.

1 comment: