Sunday, December 12, 2010

హస్తం అస్తవ్యస్తం ... అంతర్మథనంలో అధిష్ఠానం?

రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. సొంతింటిని చక్కదిద్దుకోవడంలో తలమునకలౌతోంది. ముఖ్యమంత్రులను నియమించడం, మంత్రి మండలిని ఏర్పాటు చేయడం, బెర్తుల కేటాయింపు, జగన్ ను బయటకు పంపడం, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఢిల్లీ చుట్టూ తిప్పుకోవడంలో అధిష్ఠానం పూర్తిగా పట్టు సాధించింది.  దీంతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోవడంతో అనేక సమస్యలతో ప్రజలు రోడ్డెక్కారు. కొత్తగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నా, అధిష్ఠానం మార్క్ తోనే ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి పాలన యంత్రాంగంపై పూర్తిగా పట్టు సాధించి ప్రజా సమస్యలను ఒక గాడిలో పెడదామనే ఆలోచన ఉన్నా ప్రతిదానికీ ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పార్టీ నుండి బయటకు వచ్చిన జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కొత్త పార్టీ ని ప్రకటిస్తాననడంతో జగన్ వర్గంలో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. రైతు పరామర్శ యాత్రలో భాగంగా కృష్ణ జిల్లాలో పర్యటించారు. ఇప్పటికే బందర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పెర్నేని నానితో సహా పలువురు శాసన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పిటిసిలు జగన్ వర్గంలో చేరిపోయారు. విజయవాడ ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఇదే బాటలో పయనిస్తుండడంతో కృష్ణా జిల్లాలో 80 శాతం కాంగ్రెస్ నాయకత్వం ఖాళీ అయింది. విజయవాడ ఎంపి లగడపాటి అనుచరుడు గౌతమ్ రెడ్డి కూడా జగన్ ను కలవడంతో సిఎం కిరణ్ లగడపాటిని రంగంలోకి దించి ప్రస్తుత పరిణామాలపై దృష్టి పెట్టమని ఆదేశించారు. జగన్ తొలి రోజు పర్యటనకే ఇంత స్పందన ఉంటే అన్ని జిల్లాల్లో పర్యటిస్తే రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకమేనని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ వెంట ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో 20 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం ఆయనకు పెద్ద సమస్యేం కాదు. 155 మంది ఎమ్మెల్యేలతో ఏర్పడ్డ ప్రభుత్వం 40 -50 మంది జగన్ వర్గంలో చేరితే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశముంది. తన తండ్రి కృషితో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఏనాడు కూల్చే ప్రయత్నం చేయనని జగన్ ప్రకటించారు. కానీ రైతు పరామర్శ యాత్రలో ప్రభుత్వానికి కాలం చెల్లిందని పదే పదే అనడం జగన్ ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనబడుతోంది. కడప, పులివందుల ఉప ఎన్నికల అనంతరం జగన్ అనుసరించే వ్యుహాలేమిటో తలుచుకుంటేనే అధిష్ఠానం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

No comments:

Post a Comment